హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహా శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈసారి కూడా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు పోలీస్ విభాగం ముందస్తు చర్యలు చేపట్టింది. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ప్రధాన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు.
ప్రధాన శోభాయాత్ర రూట్ కట్ట మైసమ్మ ఆలయం నుంచి ప్రారంభమై హుస్సేన్ సాగర్ (Hussain Sagar) వరకు 13 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రయాణంలో అనుబంధ రూట్లు, తిరుగు ప్రయాణ మార్గాలు, బేబీ పాండ్లు, నిమజ్జన స్థలాలు వంటి వివరాలను భక్తుల సౌకర్యం కోసం స్పష్టంగా తెలియజేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు
నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలను ట్రక్కులు, వాహనాల ద్వారా హుస్సేన్ సాగర్ వైపు తీసుకొస్తారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వద్ద భారీగా జనసందోహం ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. భక్తులు నిమజ్జనం కోసం వెళ్లే మార్గాల్లో పోలీసులు ప్రత్యేక సిబ్బందిని మోహరించనున్నారు. అదేవిధంగా అత్యవసర సేవల కోసం అంబులెన్సులు, ఫైర్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచనున్నారు.
ఈ ఏడాది గణేశ్ శోభాయాత్రలో ముఖ్యంగా ‘నో సౌండ్’ ఆంక్షలు విధించడం విశేషం. భక్తులు పెద్ద ఎత్తున డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని పోలీసులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శోభాయాత్ర అంటే ఉత్సాహం, ఆహ్లాదం అనేది సహజం కాబట్టి మ్యూజిక్ లేకుండా ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ మార్గాల్లో గణపతి విగ్రహాలు లేని ఏ వాహనాన్నీ అనుమతించమని
ప్రధానంగా బాలాపూర్ గణపతి కేశవగిరి, చాంద్రాయణగుట్ట పైవంతెన తర్వాత ఎడమవైపు తీసుకుని, మహబూబ్‌నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా ఫలక్‌నూమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, నాగులచింత-చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎస్‌ఏబజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గం వైపు శోభాయాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో గణపతి విగ్రహాలు లేని ఏ వాహనాన్నీ అనుమతించమని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (Commissioner CV Anand) తెలిపారు.సెప్టెంబర 6వ తేదీన ఉదయం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ తెలిపారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో భారీ వాహనాలు, ట్రాలీలు హైదరాబాద్ నగరంలోకి అనుమతించరు. ట్రాఫిక్ మళ్లింపు ఆర్టీసీ బస్సులకూ కూడా వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులను 6వ తేదీ ఉదయం 8 నుంచి 7వ తేదీ 10 గంటల వరకు నగరంలోకి అనుమతించరు.గణేష్ నిమజ్జన వేడుకను చూస్తేందుకు ట్యాంక్ బండ్‌కు పెద్ద సంఖ్యలో జనాలు తరలివస్తారు. కాబట్టి వారి కోసం ట్యాంక్ బండ్ కి అన్ని వైపులా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
బీఆర్‌కే భవన్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం
ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక భాగం, ఆదర్శ్ నగర్ రోడ్డు, బీఆర్‌కే భవన్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్డు, ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ జంక్షన్, ఖైరతాబాద్ ఎంఎంటీస్ స్టేషన్ దగ్గర పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు.GHMC బేబీ పాండ్స్ జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్, సంజీవయ్య పార్కు దగ్గర, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, సైదాబాద్ హౌసింగ్ కాలనీ, మూసారాం ఫ్రెండ్స్ కాలనీ, గౌలిపుర బతుకమ్మ బావి, ఐఎస్ సదన్ వైశాలినగర్, రియాసత్‌నగర్ శివాలయం, జంగంమెట్ రాజన్న బావి వద్ద ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ స్టేడియం, చింతలబస్తీ రామ్‌లీలా మైదానం, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్స్, చిలకలగూడ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, అమీర్‌పేట ప్లే గ్రౌండ్, అంబర్‌పేట అలీ కేఫ్, కుల్సుంపర ఎస్‌బీఏ గార్డెన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి.
హెల్ప్‌లైన్ నంబర్లు
ఇక ట్యాంక్ బండ్ వద్దకు రావడానికి 600 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. బషీర్‌బాగ్, ఇందిరాపార్క్, లక్డీకాపూల్, లిబర్టీ, ఆల్ ఇండియా రేడియో, ఖైరతాబాద్ వద్దకు బస్సులు చేరుకుంటాయి. సమాచారం కోసం 9959226160, 9959226154, అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌లైన్ నంబర్లు 040-27852482, 8712660600, 9010203626 అందుబాటులో ఉన్నాయి. భక్తులు, ప్రయాణికులు ఈ సూచనలను గౌరవించి శాంతియుతంగా నిమజ్జనం జరపాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: