తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. సిట్ నోటీసులపై ఆయన అత్యంత ఘాటుగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేటీఆర్ ఒక “లొట్టపీసు కేసు”గా అభివర్ణించారు. ప్రభుత్వం కేవలం లీకులతోనే కాలం గడుపుతోందని, వాస్తవానికి ఈ కేసులో పస లేదని ఆయన కొట్టిపారేశారు. తనకు అందజేసినట్లు చెబుతున్న నోటీసులను తాను ఇప్పటివరకు చూడలేదని, కేవలం మీడియా ద్వారానే ఆ విషయం తెలిసిందని పేర్కొన్నారు. అయితే, నోటీసులు అందినా, అందకపోయినా తాను “బరాబర్” (ఖచ్చితంగా) విచారణకు వెళ్తానని, తనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలే భయపడనని చెబుతూ, అధికారుల కంటే ముఖ్యమంత్రి రాజకీయ కక్షతోనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.
Davos: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తన పని అని, అందుకే ఈ నోటీసుల నాటకం ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 420 హామీలను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి సర్కార్‌ను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా ప్రజల దృష్టిని హామీల అమలు నుండి మళ్లించడమే ప్రభుత్వ ఎజెండా అని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రతిపక్షంగా తమ పోరాటం ఆగదని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక రకంగా సిట్ విచారణకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా, విచారణాధికారులపై కూడా ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ పనితీరుపై రొటీన్ ప్రక్రియగా జరుగుతున్న అంశాలనే భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన వాదించారు. సాయంత్రం 6 గంటలకు సిరిసిల్లలో ఆయన చేసిన ఈ ప్రసంగం, రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరగబోయే విచారణకు ముందే ఒక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే, ఆయన విచారణాధికారులకు సహకరిస్తూనే, బయటకు వచ్చి మరింత దూకుడుగా రాజకీయ పోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com