జూబ్లిహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సినీ కార్మికుల అభినందన సభ పెద్ద చర్చకు దారితీస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సభకు హాజరుకాకపోవడం, అదే సమయంలో ఆయన ముంబైలో అధికారిక పనులతో ఉండటం, ఆయన్ను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సభను ఏర్పాటు చేశారనే వార్తలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా కార్మికుల సమస్య పరిష్కారంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించిన కారణంగా, ఆయన లేకుండానే అభినందన సభ నిర్వహించడం తనపై రాజకీయంగా అవమానంగా భావిస్తున్నారని ప్రచారమవుతోంది.
Latest News: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు
కోమటిరెడ్డి అసంతృప్తి నేరుగా సీఎం రేవంత్‌పై కాదని, ఆయన సన్నిహితుడి జోక్యం పట్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు సీఎం వెంట కనిపించే ఆ నేత చూసుకుంటున్నారని, తన పాత్రను చిన్నబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోమటిరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆ నేత శ్రద్ధగా వ్యవహారాలు నడిపించడమే కాక, ఈ సభను కూడా తాను పాల్గొనలేని సమయంలో ఏర్పాటు చేయడం తమను పట్టించుకోకపోవడమేనని ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో మంత్రి బాధ్యతలు మరుగునపడుతున్నాయన్న భావనతో అసంతృప్తి పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి.
అయితే, అధికార వర్గాలు మాత్రం కోమటిరెడ్డికి ఎలాంటి అసంతృప్తి లేదని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగానే ఆయన ముంబైలో ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో సినీ కార్మికుల ఓట్లు కీలకమైనందున అత్యవసరంగా సభ నిర్వహించిందేనని చెబుతున్నారు. కానీ ఇటీవల కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి పలువురు మంత్రులతో సీఎం రేవంత్ అభిప్రాయ బేధాలు బహిరంగంగా బయటపడిన నేపథ్యంలో, ఇప్పుడు కోమటిరెడ్డి పేరు కూడా జాబితాలో చేరడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై మళ్లీ చర్చలు జోరందుకున్నాయి. దీనిపై పార్టీ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/