ఆశ్రమపాఠశాలలో ఇటీవల సమస్యలు పెరుగుతున్నాయి. సరైన శుభ్రత పాటించని ఆహారం భుజించి, తరచూ పిల్లలు అనారోగ్యానికి గురువుతున్నారు. హాస్టల్ విద్యార్థుల (Hostel students) ను అంబులెన్స్ లలో చికిత్స నిమిత్తం తరలిస్తుంటే అవి స్కూల్ బస్సులను తలపించేలా ఉంటున్నాయి. డెంగ్వీ జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇవ్వాల్సిందిపోయి, పాఠశాలలోనే నేలపై పడుకోబెట్టి చికిత్స అందించిన వైనం పలు విమర్శలకు దారితీసింది. ఈ సమస్యలు ఇలా కొనసాగుతుంటే తాజాగా ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిట్స్ తో కుప్పకూలిపోయిన బాలిక
ఖమ్మం (Khammam) జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తొల్లగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న కూసుమంచి మండలం బోడియతండాకు చెందిన భూక్యరమేష్, బూబమ్మ దంపతుల కూతురు ప్రతిమ(15) ఉంది. అయితే సోమవారం మధ్యాహ్నం పరీక్ష రాస్తుండగా ప్రతిమకు హఠాత్తుగా ఫిట్స్ వచ్చింది. దీంతో కిందపడిపోయిందని, వెంటనే ప్రాథమిక చికిత్స అందించామని పాఠశాల సిబ్బంది తెలిపింది.
మెరుగైన చికిత్స కోసం తరలించినా ప్రయోజనం లేదు
మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పక్రతికి తరలించామని, అప్పటికే ప్రతిమ చనిపోయిందని వైద్యులు తెలిపినట్లు హాస్టల్ సిబ్బంది పేర్కొంది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు వారు చెప్పారు.
సిబ్బందిని నిలదీసిన బాలిక తల్లిదండ్రులు
ఫిట్స్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లారని సిబ్బందిని బాలిక తల్లిదండ్రులు నిలదీసారు. తమ కూతురికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు బాలిక తల్లిదండ్రులు, బంధువులు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై
కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు అధికారులు హామీ ఇచ్చారు. ఏదిఏమైనా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Cultural Movement : బిసిల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం