తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 10న జరిగిన క్యాబినెట్ (Telangana Cabinet) సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ)కు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితిలో ఈ నిర్ణయం వేగంగా తీసుకున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. సంబంధిత ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది బీసీ తరగతులకు రాజకీయ ప్రతినిధిత్వాన్ని బలోపేతం చేసే దిశగా చేపట్టిన నిర్ణయంగా పేర్కొనవచ్చు.
విద్య, పరిపాలన రంగాల్లో సంస్కరణలు
క్యాబినెట్ సమావేశంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి అమిటీ, సెంచరీ రిహాబిలిటేషన్ సంస్థలను విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చేసేందుకు బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ విద్యార్థుల కోసం 50 శాతం సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఇదే సమావేశంలో గత క్యాబినెట్ సమావేశాల సారాంశాన్ని ప్రజలకు తెలిపే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 327 అంశాల్లో 96 శాతం అమలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై ప్రతి రెండు వారాలకు ఒకసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
మేడిగడ్డపై లోతైన చర్చ, ఇతర కీలక అంశాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై వచ్చిన జాతీయ నివేదికలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపారు. అప్పటి క్యాబినెట్ మినిట్స్‌ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో స్టాంప్ & రిజిస్ట్రేషన్ చట్టం సవరణ, గోశాలల నిర్మాణం, రేషన్ కార్డుల జారీ, మహిళల సంక్షేమం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తవడంతో బీసీ జనాభా 46.25%గా నమోదు కావడం, భవిష్యత్తు పథకాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
Read Also : Mee Seva Services: మీ సేవలో మరో రెండు సేవలు ప్రారంభం