తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని మలుపు ఇచ్చారు. సిట్ (SIT) విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తూనే, పోలీసుల వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతూ జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తన ఇంటి గోడపై నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలనే చట్టబద్ధమైన నిబంధనలను గుర్తు చేస్తూ, తనను విచారించే అధికార పరిధి ఏసీపీకి లేదని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
Vasundhara Yadav : అప్పుడు మోనాలిసా..ఇప్పుడు ఏసీపీ వసుంధర..సోషల్ మీడియా లో ట్రేండింగ్
నోటీసుల జారీలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని కేసీఆర్ ఆరోపించారు. ‘సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ మరియు ‘వీడీ మూర్తి’ వంటి కీలక కేసుల తీర్పులను ఉటంకిస్తూ, చట్టం ప్రకారం ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పేర్కొన్నారు. తన శాశ్వత నివాసం ఎర్రవల్లిలో ఉందని, భవిష్యత్తులో నోటీసులన్నీ అక్కడికే పంపాలని పోలీసులకు సూచించారు. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని, అయితే పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను తోసిపుచ్చవచ్చని పేర్కొన్నప్పటికీ, విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. దీంతో విచారణాధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు చట్టపరమైన అభ్యంతరాలను లేవనెత్తుతూనే, మరోవైపు విచారణకు సిద్ధమవ్వడం ద్వారా ఈ కేసులో ఎదురుదాడికి కేసీఆర్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ పరిణామం రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com