మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులను గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ, ఏ భారీ ప్రాజెక్టు నిర్మించినా అందులో పాలమూరు వలస కూలీల రక్తం, శ్రమ దాగి ఉన్నాయని.. అంతటి కష్టజీవులున్న ఈ జిల్లాకు కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో సాధించి ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డల కష్టాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.
Konaseema feast : కొత్త అల్లుడికి 1,574 రకాల వంటకాలతో భారీ విందు
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) విషయంలో జరిగిన అవినీతిని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపు 23 వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పనులు పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. నీళ్లు పారకపోయినా కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నిండాయని, ఇది కేవలం కమీషన్ల కోసమే చేసిన ప్రాజెక్టుగా మిగిలిపోయిందని విమర్శించారు. నిధుల మళ్లింపు వల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదని, ఫలితంగా జిల్లా రైతాంగానికి సాగునీరు అందకుండా పోయిందని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ముఖ్యంగా ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం మరియు ఇతర నిధులను చెల్లించకుండా వారిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రాధాన్యత పేద రైతులకు, భూనిర్వాసితులకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com