Kavitha Praja Budget: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ‘సర్వోదయ తెలంగాణ’ లక్ష్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని ఆకాంక్షించిన ఆమె, సమాజ సేవలో నిబద్ధత అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల త్యాగనిరతిని కొనియాడుతూ, అదే స్ఫూర్తి జాగృతి సంస్థలోనూ ప్రతిబింబించాలని ఉద్ఘాటించారు.

Read Also:Telangana Rising Vision 2047: బడ్జెట్ సిద్ధం.. యంగ్ ఇండియా కిట్స్ సహా ఆరు కొత్త పథకాలు!
జాగృతి పార్టీయే అధికారంలోకి వస్తుంది!
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో జాగృతి పార్టీ అధికారం చేపడుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుమారు రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తరుణంలో, ఆమె జాగృతి తరపున రూ. 2.23 లక్షల కోట్లతో కూడిన ప్రత్యామ్నాయ ‘ప్రజా బడ్జెట్’ను ప్రకటించారు. ఈ నిధులను కేవలం ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, పలు రంగాలకు కీలక కేటాయింపులను సూచించారు.
విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేయాలని డిమాండ్
ఈ ప్రజా బడ్జెట్‌లో విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వైద్యానికి రూ. 25 వేల కోట్లు, విద్యకు రూ. 30 వేల కోట్లు, యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రంగంలో కౌలు రైతుల రక్షణ కోసం రూ. 35 వేల కోట్లు, పేదల గృహ నిర్మాణానికి రూ. 20 వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ. 25 వేల కోట్లు ఉండాలని సూచించారు. నిరుద్యోగితను తగ్గించేందుకు చిన్న తరహా పరిశ్రమలకు రూ. 10 వేల కోట్లు, ప్రత్యక్ష ఉద్యోగ కల్పనకు రూ. 3 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
సామాజిక వర్గాల వారీగా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలకు రూ. 20 వేల కోట్లు, ఎస్సీలకు రూ. 18 వేల కోట్లు, ఎస్టీ మరియు ఆదివాసీలకు రూ. 10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమానికి రూ. 15 వేల కోట్లతో పాటు, ఆడపిల్లల స్కూటీల పంపిణీకి రూ. 5 వేల కోట్లు కేటాయించాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి వెయ్యి కోట్లు, ఉద్యమకారులు మరియు కళాకారులకు రూ. 5 వేల కోట్లు, ఆటో డ్రైవర్ల కోసం రూ. 100 కోట్లు కేటాయించాలంటూ ఒక సమగ్ర ప్రణాళికను కవిత ప్రభుత్వం ముందుంచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: