సభ విజయవంతం – కేసీఆర్ ప్రసంగంపై శ్రేణుల ఉత్సాహం, హుందాతనానికి ప్రశంసలు
‘సభ విజయవంతమవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. మీ ప్రసంగం (కేసీఆర్) పూర్తయ్యే వరకూ శ్రద్ధగా విన్నారు. మీరు ‘ఆపరేషన్ కగార్’పై మాట్లాడటం ప్రజలందరికీ నచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అనుకుంటున్నారు. పహల్గాం ఘటనలో మృతి చెందిన అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా సీఎం ‘రేవంత్ రెడ్డి’ పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజూ విమర్శిస్తున్నప్పటికీ, మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని పార్టీ శ్రేణుల్లో చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తంగా మీ స్పీచ్‌లో ఇంకొంచెం పంచ్‌ని ఆశించారు. అయినా కార్యకర్తలు, నాయకులు సభతో సంతృప్తిగా ఉన్నారు.
పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా పార్టీ శ్రేణుల్లోకి బలంగా వెళ్లింది.
ఉర్దూ మౌనం, వక్ఫ్ బిల్లు – మైనార్టీల నిరాశకు వేదిక?
ఉర్దూ భాషలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పూర్వ ఇన్‌ఛార్జులకు ఇవ్వడంతో వాళ్లు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్‌బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. మళ్లీ పాత ఇన్‌ఛార్జులకే స్థానిక సంస్థల ఎన్నికల బీ-ఫాంల బాధ్యతలను బీఆర్ఎస్ పార్టీ అప్పగిస్తుందని ఇన్‌ఛార్జులు చెప్పుకొంటున్నట్లు తెలిసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నేరుగా బీ-ఫాం డిమాండ్
స్థానిక సంస్థల (లోకల్ బాడీస్) ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునేవారు రిలాక్స్‌గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ఉండాలనుకునే వాళ్లు ఇన్‌ఛార్జుల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీ-ఫాంలు ఇవ్వాలని కోరుతున్నారు. మీరు సభా వేదిక మీదకు వచ్చేలోపు 2001 నుంచి మీతో ఉన్న లీడర్స్‌కు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలామంది అన్నారు.
బీజేపీపై తక్కువ మాట్లాడటంతో – పొత్తు ఊహాగానాలు ..
పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘ధూం ధాం’ ఫెయిలైంది. బీజేపీ గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు (కేసీఆర్) ఇంకా బలంగా మాట్లాడాలని ఉండె. ఆ పార్టీ వల్ల నేను బాధపడ్డాను కదా! అందుకని కావచ్చు! మీరు బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో నాన్న. కాంగ్రెస్ పార్టీపై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. దానికి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలో మనం పోటీ చేయకుండా బీజేపీకి సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను, మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆశించారు.
దయచేసి అందరినీ కలవండి నాన్న
కనీసం ఇప్పుడైనా మనం ఒకటి రెండు రోజులు ప్లీనరీని నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను స్వీకరించి, మార్గనిర్దేశం చేయాలి. ఈ విషయానికి సంబంధించి కొంచెం సీరియస్‌గా ఆలోచన చేయండి. చాలామంది మీతో(కేసీఆర్) ఫొటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్‌గా అనిపించింది. జడ్పీటీసీ సభ్యులుగా, జడ్పీ ఛైర్మన్‌లుగా, శాసనసభ్యులుగా పనిచేసిన నాయకులు చాలామంది మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారు. పరిమితంగా, కొద్దిమందికే కలిసే అవకాశం వస్తోందని భావిస్తున్నారు. దయచేసి అందరినీ కలవండి.
సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ! ధన్యవాదాలు’ అని కవిత లేఖలో చెప్పారు.
Read also: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం.. రూ.లక్షలోపు రుణాలకు TG నిర్ణయం