కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తాజాగా కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, అలాగే పలు ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టు దిశగా బీఆర్ఎస్
ఈ ఆరోపణలను ఖండించేందుకు బీఆర్ఎస్ పార్టీ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది. కమిషన్ నివేదికను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం
ఈ పరిణామాల నడుమ కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో హరీశ్ రావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు పలు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారాన్ని ఎదుర్కోవడం, అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గురించి ఈ చర్చలో ప్రధానంగా చర్చించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందన
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)“లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు కూలిపోయింది” అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ ఆరోపణలకు ఎలా ప్రతిస్పందించాలో కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ప్రజల్లోకి వెళ్లే ప్రణాళిక
బీఆర్ఎస్ పార్టీపై ఇటీవల పెరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని అధిగమించేందుకు, మళ్లీ ప్రజల్లో నమ్మకం పెంచుకునేందుకు ఏ విధంగా ముందుకు సాగాలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రచార వ్యూహాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాబోయే ఎన్నికల వ్యూహం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమాలోచనలు జరిగాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: