తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “గద్దర్ అవార్డులు” ఇప్పుడే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రజా గాయకుడు, ఉద్యమ నాయకుడు గద్దర్ పేరు మీదుగా ఈ అవార్డులు ప్రారంభించడంపై సినిమా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ నటి జయసుధ అధ్యక్షతన 15 మంది సభ్యులతో జ్యూరీ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ జ్యూరీలో నటి జీవిత, దర్శకులు దశరథ్, వీఎన్ ఆదిత్య, నందిని రెడ్డి, శివ నాగేశ్వరరావు, రచయిత కాసర్ల శ్యామ్, నిర్మాత రాజా తదితరులు సభ్యులుగా ఉన్నారు.
2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన ఉత్తమ సినిమాలకు
జ్యూరీ సమావేశంలో సినిమా నిపుణులతో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ పాల్గొన్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ అవార్డులు 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన ఉత్తమ సినిమాలకు వర్తిస్తాయి. పైడి జయరాజ్, కాంతారావుల పేరిట ప్రత్యేక పురస్కారాలు, ఉర్దూ సినిమాలకు ప్రోత్సాహంగా బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా ప్రకటించనున్నారు.
మొత్తం 1248 నామినేషన్లు
ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 1172 వ్యక్తిగత విభాగాల్లో, 76 నానా ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, క్రిటిక్ రచనలు వంటి విభాగాల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో, గద్దర్ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని వచ్చే నెలలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇవి తెలుగుసినిమాకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనున్నాయి.