Jangaon Collector: జనగామ జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు వివాదాస్పదంగా మారింది. ఉపాధి పొందుతున్న తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇద్దరు దళిత మహిళలు కలెక్టర్‌తో పాటు మరికొందరు అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది.
Read Also: Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు.
ఉపాధి నుంచి వీధిలోకి..
సుమారు ఆరు నెలల క్రితం, అప్పటి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చొరవతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద ఇద్దరు దళిత మహిళలకు చెరో రూ. 3 లక్షల రుణం మంజూరైంది. ఈ నిధులతో కలెక్టరేట్ కార్యాలయం ముందే ఒక మహిళ టీ స్టాల్‌ను, మరో మహిళ విజయ డైరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఆరు నెలలుగా వారు సక్రమంగా లోన్ వాయిదాలు చెల్లిస్తూ గౌరవంగా జీవనం సాగిస్తున్నారు.

ప్రస్తుత కలెక్టర్ తీరుపై ఆగ్రహం
అయితే, ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత వారం రోజులుగా కలెక్టరేట్ ముందున్న ఆ డబ్బాలను తొలగించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం జేసీబీలు, డోజర్లతో ఆ డబ్బాలను తొలగించే ప్రయత్నం చేయగా, బాధితులు అడ్డుకుని నిరసన తెలిపారు. అధికారుల వేధింపులు మితిమీరడంతో, చివరకు బాధితులు చట్టపరమైన పోరాటానికి దిగారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
తమను కులం పేరుతో దూషిస్తూ, ఉపాధిని దెబ్బతీస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ బాధితులు జనగామ పోలీస్ స్టేషన్‌లో సిఐ సత్యనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీవో వసంత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మరియు ఇతర రెవెన్యూ అధికారులపై కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిల్ (PIL) దాఖలు చేశారు.
ప్రభుత్వ హామీలపై ప్రశ్నలు
“కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు మండిపడుతున్నారు. లాభం వచ్చినా రాకపోయినా కష్టపడి లోన్ డబ్బులు కడుతున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా డబ్బాలు తొలగిస్తే మిగిలిన అప్పు ఎలా తీర్చాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: