తెలంగాణలో భూవివాదాలు, భూ దోపిడీ అంశాలపై రాజకీయ దుమారం మళ్ళీ ముదిరుతోంది. తాజాగా కేటీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం తో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. BRS నేత KTRను లైవ్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. IMG బిల్లీరావు దగ్గర నుంచి కమీషన్ తీసుకున్నందునే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని మహేశ్ ఆరోపించారు. ఇది బహిరంగంగా జరిగిందని, ప్రజల ముందు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
“భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి”
కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి 400 ఎకరాల భూమిని రికవర్ చేసిందని తెలిపారు. ఈ భూములపై ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు ఏర్పడితే రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించిందని, లక్ష ఎకరాల వరకు అడవులను డీఫారెస్ట్ చేసి వికాసానికి అడ్డుగానే మారిందని ఆరోపించారు. “భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి” అంటూ ఆయన కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం చాలా ముఖ్యం అని పేర్కొంటూ, గత ప్రభుత్వం చేసిన తప్పులకు KTR బహిరంగంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.