తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం గృహ నిర్మాణ హక్కును సమర్థంగా అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించి, మరింత పారదర్శకంగా చేపడుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం, ఈ పథకం అమలును ప్రజల కోసం సమగ్రంగా మలచే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు కృషి
ప్రస్తుతం ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో ఇంటింటికి వెళ్లి, స్థానిక స్థాయిలో ఏర్పాటైన ఇందిరమ్మ కమిటీల సిఫార్సుల ఆధారంగా అధికారులు లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనర్హుల పేర్లను తొలగించి, అర్హుల వివరాలను గ్రామ/వార్డు స్థాయిలో ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రక్రియ మరింత ఖచ్చితంగా సాగేందుకు, ఎంపికైన లబ్ధిదారుల వివరాలు గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌కు నేరుగా పంపిస్తున్నారు. అక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ఆధ్వర్యంలో రూపొందించిన ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రతి లబ్ధిదారుని డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది.
కృత్రిమ మేధతో విశ్లేషణ: అనర్హుల వేట
ఈ పరిశీలనలో ముఖ్యంగా ఎంపికైన వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా, పట్టణంలో సొంత ఇల్లు ఉండి గ్రామంలో ఇల్లు పొందుతున్నా లేదా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండి కూడా లేదని తప్పుడు సమాచారం ఇచ్చినా అలాంటి వారిని కృత్రిమ మేధస్సు సహాయంతో గుర్తించి అనర్హులుగా ప్రకటిస్తారు.
మే 10 లోగా ప్రొసీడింగులు
ప్రస్తుతం జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మండలాల అధికారులు ఆన్‌లైన్ డేటా నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు. శుక్రవారం నాటికి సుమారు పది మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఈ డేటా నేరుగా జిల్లా కలెక్టర్ లాగిన్‌లోకి చేరుతుండటంతో, త్వరితగతిన తుది జాబితా సిద్ధం చేయడం సాధ్యమవుతోంది. లబ్ధిదారులు కచ్చితంగా తమ ఇంటి నిర్మాణాలను 600 చదరపు అడుగల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇళ్లు మంజూరైన వారిలో ఎవరైనా అనర్హులని తేలితే వారికి కేటాయించిన ఇంటిని రద్దు చేస్తామని కూడా అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లోని గృహనిర్మాణ శాఖలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సంస్థ సిబ్బంది ఆధునిక సాఫ్ట్‌వేర్‌లో కృత్రిమ మేధస్సును ఉపయోగించి లబ్ధిదారుల సమగ్ర వివరాలను పరిశీలిస్తారు.
తుది దశలో ప్రక్రియ:
ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం, మే 10వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత, గృహ నిర్మాణ పనులు గ్రామ, మండలాల వారీగా ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు జరగనుంది. ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలకు సమర్పించిన డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు. మండలాల్లో ఆన్‌లైన్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున.. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు జారీ చేస్తారు.