తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు(Retirement Age)ను 60 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అమలులోకి రావడంతో వేలాదిమందికి ఊరట కలిగే అవకాశం ఉంది. దీని ద్వారా అంగన్వాడీ సిబ్బంది మరికొంతకాలం పాటు సేవలందించే అవకాశాన్ని పొందుతారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో భారీ పెంపు
పదవీ విరమణ సమయంలో అందే ప్రయోజనాల పరంగా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ టీచర్లకు ఇప్పటి వరకు అందుతున్న రూ. 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ. 2 లక్షలకు పెంచింది. అలాగే, హెల్పర్లకు అందే బెనిఫిట్ రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచబడింది. ఇది ఉద్యోగుల కృషికి గౌరవంగా నిలిచే ఒక ముఖ్యమైన చర్యగా చెబుతున్నారు. 60 ఏళ్లు దాటి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే వారికి కూడా ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
70 వేల మందికి లాభం
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది. చాలా కాలంగా రిటైర్మెంట్ వయస్సు పెంపు మరియు బెనిఫిట్స్ విషయంలో వారు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి ఎంతో ఊరటను కలిగించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. సుదీర్ఘకాలంగా గ్రామీణ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు ఇది మానసికంగా ప్రోత్సాహాన్ని ఇచ్చే నిర్ణయంగా భావించవచ్చు.
Read Also : Boko Haram : నైజీరియాలో పాకిస్థానీయుల అరెస్ట్