హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఈరోజు 19 జూన్ 25 రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాలు మరియు డ్రైవర్లతో కలిసి విద్యార్థుల భద్రతపై ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మరియు డీజీ శ్రీ సి.వి. ఆనంద్ (Anand), ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీమతి దాసరి హరిచందన ఐఎఎస్ (కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, హైదరాబాద్), శ్రీ గోపాల్ (అదనపు కమీషనర్, జీహెచ్‌ఎంసీ), శ్రీ రమేష్ (జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్), శ్రీ మునిశేఖర్ (ఈడి, ఆర్‌టిసి), శ్రీ డి. మధూకర్ నాయక్ (సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు), శ్రీ రాజశేఖర్ రెడ్డి (హెచ్.సి.ఎస్.సి సెక్రటరీ జనరల్, ట్రాఫిక్ ఫోరమ్), శ్రీ శేఖర్ రెడ్డి (హెచ్.సి.ఎస్.సి సెక్రటరీ జనరల్),శ్రీమతి ఆర్. రోహిణి (డిఈఓ), శ్రీ లింగయ్య (అదనపు డైరెక్టర్, పాఠశాల విద్య) మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు మరియు తిరిగి వచ్చేటప్పుడు వారి భద్రతను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చ జరిగింది.
పాఠశాలల చుట్టూ ట్రాఫిక్ నిర్వహణ, సురక్షిత రవాణా పద్ధతులు మరియు వాటాదారులందరిలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం వంటి వివిధ అంశాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై సమావేశం జరిగింది. వాహన అనుమతులు, సీటింగ్ సామర్థ్యం, పాఠశాలల పేర్లు మరియు నంబర్ల ప్రదర్శన, డ్రైవర్ అనుభవం మరియు ప్రతి బస్సులో మహిళా అటెండర్ ఉండటం వంటి వాటిపై కూడా చర్చ జరిగింది. పాఠశాల విద్యార్థుల రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) శ్రీమతి రోహిణి గారు మాట్లాడుతూ పాఠశాల బస్సులలో విద్యార్థుల భద్రతకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పారు. ఇందులో మహిళా సహాయకులను నియమించడం మరియు బస్సుల ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం
శ్రీమతి దాసరి హరిచందన,ఐఎఎస్ (కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, హైదరాబాద్) గారు మాట్లాడుతూ పాఠశాల పిల్లలు పాల్గొనే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తక్షణమే ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) రూపొందించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పారు. పాఠశాలలు G.O. Ms. No. 187 (07-07-2017) ను ఖచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. ఇది 6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్యా హక్కు చట్టాన్ని సమర్థించడానికి తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనలను పాటించడం ద్వారా విద్యార్థులకు సురక్షితమైన రవాణా మరియు విద్యా వాతావరణం కల్పించవచ్చని తెలియ జేసినారు.
పాఠశాలల పరిసరాల్లో ట్రాఫిక్‌ను చూసుకోవడం యాజమాన్యాల బాధ్యత
ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ శ్రీ. డి.జోయల్ డేవిస్ ఐపిఎస్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజూ 90 లక్షల పైగా వాహనాలు హైదరాబాద్‌లో తిరుగుతున్నాయని, 3 వేల మంది సిబ్బందితో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారని తెలిపారు. 2023 నుండి 2025 వరకు 8 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. త్వరలో పాఠశాలల వద్ద డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, పాఠశాలల పరిసరాల్లో ట్రాఫిక్‌ను చూసుకోవడం యాజమాన్యాల బాధ్యత అని స్పష్టం చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి యాజమాన్యాలు ట్రాఫిక్ మార్షల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో ఎక్కించుకోకూడదని, దీనిని పోలీసుల బాధ్యతగా వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రైమరీ స్కూల్, హై స్కూళ్ల సమయాల్లో మార్పులు చేయడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లను కట్టడి చేయవచ్చని సూచించారు. మైనర్లకు వాహనాలు నడిపితే వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని మరియు వారికి 25 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదని హెచ్చరించారు. ఇప్పటివరకు 766 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అనంతరం శ్రీ సి.వి. ఆనంద్, ఐపిఎస్, డీజీ & పోలీస్ కమీషనర్, హైదరాబాద్ గారు మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల భద్రతపై ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం ఈ విధమైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ మరియు వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనప్పుడు భద్రతా సమస్యలు వస్తాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల గత మూడు సంవత్సరాల్లో 8 మంది మరణించారని గుర్తు చేశారు. విద్యార్థులు పాఠశాల బస్సులలోనే ప్రయాణించేలా చూసుకోవాలని, ప్రతి పాఠశాలలో బస్సుల యొక్క భద్రతా చర్యలను యాజమాన్యం పాటించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణానికి 200 మీటర్ల పరిధిలో భద్రతా లోపాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
భద్రతా ప్రమాణాలు మరియు ప్రతి పాఠశాల పరిసరాలలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని, వాటి నిర్వహణ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలని సూచించారు. డ్రైవర్లు పిల్లలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పరిసర ప్రాంతాలను గమనించాలని, అక్కడే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క విద్యార్థి ప్రమదానికి గురి ఐనా పాఠశాలకు పెద్ద సమస్యగా మారుతుందన్నారు. పిల్లలు పాఠశాలలకు ఓవర్ లోడెడ్ ఆటోలలో కూడా వెళ్తున్నారని, అలా వెళ్లడం వల్ల ప్రమాదాలు, మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని, వీటిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లు ఎంతమంది పిల్లలను తీసుకువెళ్తున్నారో తల్లిదండ్రులు కూడా గమనించాలన్నారు. యాజమాన్యాలు పాఠశాల పరిసర ప్రాంతాలలో సైన్ బోర్డు ఉండేలా చూసుకోవాలి. ఒకే ప్రాంతంలో ఎక్కువ పాఠశాలలు ఉన్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, ఉదాహరణకు అబిడ్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. అలాంటి ప్రాంతాలలో రవాణా, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. సిటీ పోలీస్‌లో 3 వేల మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, నగరంలో మొత్తం 650 జంక్షన్లు ఉన్నాయని, సిబ్బంది కొరత వల్ల వాటిలో 325 జంక్షన్ల వద్ద మాత్రమే డ్యూటీలు వేయగలుగుతున్నామని వివరించారు. పాఠశాలలకు సమీపంలో పాన్ షాపులు మరియు జ్యూస్ సెంటర్లు ఉండటం వల్ల మాదకద్రవ్యాల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ విభాగాల వారు అప్రమత్తంగా ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also : Israel Iran :భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్