బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దాంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ (Telangana)లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తార వర్షాలు
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు వర్షాల ప్రభావానికి ఎక్కువగా గురికాబోతున్నాయి. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వరదల పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు
రాజధాని హైదరాబాద్‌లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
- ఆదివారం: కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ (Red alert in Warangal).
- సోమవారం: భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాల అవకాశం.
- మంగళవారం: కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే సూచనలు.
- బుధవారం: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
వరుస అల్పపీడనాల ప్రభావం
ప్రస్తుతం ఉన్న అల్పపీడనం సోమవారం నాటికి బలహీనపడుతుందని, అదే రోజు పశ్చిమ వాయువ్య దిశలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ వారమంతా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు సూచనలు
భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రవాణా అంతరాయం, విద్యుత్ సమస్యలు, వరదల ముప్పు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, నదులు, వాగులు, వంకలు దాటవద్దని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: