Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు

Read Time:  1 min
Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు
FONT SIZE
GET APP

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తూ వారి ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నమ్మబలికి, ఇప్పుడు రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టడం దారుణమని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే నిధులు జమ చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో ప్రగల్భాలు పలికారని, కానీ ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు గడుస్తున్నా, క్యాబినెట్ సమావేశంలో కూడా దానిపై ఉలుకూ పలుకూ లేదని విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించిన చరిత్ర లేదని, ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

ప్రభుత్వ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని, ప్రజాధనాన్ని పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణకు, ఫోర్త్ సిటీ భూసేకరణకు వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తోందని ఆయన నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు రూ. 25 వేల కోట్ల బిల్లులు చెల్లించడానికి, ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి నిధులు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు ఇవ్వడానికి చేతులు రావా అని ప్రశ్నించారు. ఒకవైపు ప్రజా పాలన అంటూనే జూబ్లీహిల్స్‌లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం, దాని చుట్టూ రూ. 9 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్‌బాల్ కోర్టులు నిర్మించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి వెంటనే రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.