హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకున్న తాజా ఘటన జుట్టు చికిత్సల పేరుతో కొనసాగుతున్న మోసాలపై మరోసారి దృష్టిని తెచ్చింది. బట్టతల సమస్యతో బాధపడుతున్నవారిని టార్గెట్ చేస్తూ మానవ మనసుల ఆకాంక్షలతో ఆడుకుంటున్న దుర్మార్గుల కథ ఇది. లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయింది అంటూ బాధితులు వాపోతుండగా, ఈ సంఘటనపై ప్రజల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న చైతన్యం కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జుట్టు అంటే భారతీయులకి అత్యంత ప్రత్యేకమైన అంశం. ప్రాచీన కాలం నుంచి జుట్టును అందం, ఆరోగ్య సూచికగా భావిస్తూ వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు మోడల్స్ లుక్‌తో కనిపిస్తూ, వారి లాంటి హెయిర్‌స్టైల్ కావాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఈ కోరికను కొందరు మోసం చేయడానికి అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా తాను సెలబ్రిటీలకూ జుట్టు మొలిపించానంటూ ప్రచారం చేసిన ఒక వ్యక్తి, హైదరాబాద్ పాతబస్తీలో డబ్బులు దండుకొని పరారయ్యాడు.
సోషల్ మీడియా మాయ
ఢిల్లీకి చెందిన ఓ వకీల్ తాను జుట్టు పెంచే మాయా చికిత్స అందిస్తానంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను బిగ్‌బాస్ పాల్గొన్న సెలబ్రిటీకి కూడా జుట్టు మొలిపించానంటూ నమ్మబలికాడు. హైదరాబాద్ వస్తున్నాను, పాతబస్తీలో ఒక సెలూన్‌లో అందుబాటులో ఉంటాను అంటూ మరింత వక్రీకరించాడు. ఈ ప్రచారంతో వందలాది మంది బాధితులు ఆదివారం పాతబస్తీకి క్యూ కట్టారు. ఒక్కొక్కరికి రూ.200 వసూలు చేసి గుండు కొట్టించాడు. ఆ తర్వాత ఒక లిక్విడ్ రాసి ఇది తడిపెట్టు, ఆరిపోనివ్వకేండీ అని చెప్పాడు. కానీ సాయంత్రానికి కెమికల్ ప్రభావంతో తలపై మంటలు, బొబ్బలు రావడం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికి తలపై జుట్టు ఉండాలని ఆకాంక్ష ఉండటం సహజం. కానీ ఈ కోరికను తమ లాభార్జనానికి ఆయుధంగా మార్చుకున్న మోసగాళ్లు, కేవలం డబ్బు కోసమే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కెమికల్స్ వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ రోగాలు, వాపులు వస్తుండగా, బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీసే పరిస్థితి వచ్చింది.
బాధితుల వేదన
బాధితులు ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వకీల్ అనే ఆ వ్యక్తి ముందే డబ్బులు దండుకొని పరారైనట్లు తెలిసింది. అతని వీడియోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన తరువాత ఎక్కువ మంది జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాఫిక్‌గా మారింది. ‘లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటూ’ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. లేని జుట్టుకోసం పరుగులు తీయకండి – ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Read also: Bhadrachalam : భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం