హైదరాబాద్ (Hyderabad) నగరంలో జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే వాహనాల (vehicles) వల్ల పెరుగుతున్న వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం కూడా ఒక కీలక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్‌ఆర్ (ORR) పరిధిలో కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు (Autos) అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం జీవో నెం.263ను జారీ చేసింది.
ORR లోపల సీఎన్జీ ఆటోలకు అనుమతి
ఈ జీవో ప్రకారం, ఓఆర్‌ఆర్ లోపల కొత్తగా 20,000 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, 10,000 ఎల్పీజీ ఆటోలు, 10,000 సీఎన్జీ ఆటోలకు అనుమతి లభించింది. ఇది హైదరాబాద్ నగరంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గట్టి అడుగుగా భావించవచ్చు. కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇకపై కొత్తగా అనుమతించే ఆటోలు సంపూర్ణంగా గ్రీన్ ఎనర్జీ ఆధారితవై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
25,000 వాహనాలకు ప్రత్యేక అనుమతి
అంతేగాక, ఇప్పటికే నగరంలో నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆధారిత ఆటో రిక్షాలను కూడా పర్యావరణ హిత వాహనాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇందుకోసం రీట్రోఫిట్‌మెంట్ ద్వారా వాటి ఇంజిన్లను ఎలక్ట్రిక్, LPG లేదా CNG లాగా మార్చుకునేందుకు 25,000 వాహనాలకు ప్రత్యేక అనుమతినిచ్చింది. దీని వల్ల గాలి కాలుష్యాన్ని తగ్గించడమే కాక, డ్రైవర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం కలగనుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ నిర్ణయం నగరంలోని రవాణా వ్యవస్థను క్లీన్ అండ్ గ్రీన్ దిశగా నడిపించేందుకు శుభ సంకేతంగా చెప్పవచ్చు.
Read Also : Cough: దగ్గే కదా అని కొట్టిపారేయకండి..ఈ జాగ్రత్తలు పాటించండి