తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వినియోగంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులే ఆ ఇళ్లలో నివసించాల్సి ఉండగా, చాలా చోట్ల ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా ఖాళీగా ఉంచడం వంటి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, మే 1వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో ముమ్మర తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ కేటాయించిన వారు అక్కడ ఉండకుండా అద్దెకు ఇచ్చినట్లు తేలితే, వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, సరైన సమాధానం లేని పక్షంలో ఆ కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతర నిరుపేదలకు ఆ ఇళ్లను బదిలీ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
Read Also : Gas : గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తాము అదే ఇంట్లో నివసిస్తామని లేదా ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తామని బాండ్ పేపర్ మీద రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్ష్యం నిజమైన నిరుపేదలకు సొంత గూడు కల్పించడమేనని, దీనిని వ్యాపార వనరుగా మార్చుకోవడం సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ చర్య ద్వారా అనర్హులను ఏరివేసి, ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన కుటుంబాలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. క్షేత్రస్థాయి పరిశీలనలో పారదర్శకత పాటించాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :