తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Phase-2)ప్రాజెక్టుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ. 24,269 కోట్లు విలువైన ఈ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ముందుకు తీసుకురావాలని కోరారు. రాష్ట్రం తరఫున అన్ని అవసరమైన సాంకేతిక నివేదికలు, ప్రతిపాదనలు సమర్పించినట్లు సీఎం ఖట్టర్‌కు వివరించారు.
ఉమ్మడి ప్రాజెక్టుగా ముందుకు వెళ్లాలన్న రాష్ట్రం ఉద్దేశ్యం
76.4 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు స్థిరమైన పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్ వివరించారు. ప్రయాణీకులకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించేందుకు మెట్రో విస్తరణ అత్యవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యకు మెట్రో ఫేజ్-2 మార్గం
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుసంధానంతో నగర రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని, ముఖ్యంగా రద్దీ గల ప్రాంతాల్లో ప్రయాణ సౌకర్యం పెరుగుతుందని సీఎం వివరించారు. శరవేగంగా పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మెట్రో సేవలను విస్తరించడం అనివార్యమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు.
Read Also : Yogandhra 2025 : రేపు, ఎల్లుండి వైజాగ్ జిల్లాలో స్కూల్స్ కు సెలవు