తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని నేటి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. స్లాట్ విధానం ద్వారా ముందుగా సమయం కేటాయించుకోవడం ద్వారా ప్రజలకు వేచి ఉండే అవసరం లేకుండా అవలీలగా సేవలు లభిస్తాయని తెలిపారు.
47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు
ఇప్పటికే ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సేవలపై ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, వ్యవస్థపై ప్రజలు విశ్వాసం పెంచుకోవడంతో ఇక నుంచి అన్ని కార్యాలయాల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా సాగనుందని పేర్కొన్నారు.
అందుబాటులోకి ఏఐ చాట్
ఇటువంటి డిజిటల్ సేవల అమలుతోపాటు, ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా ఏఐ చాట్బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ నంబర్ 8247623578 ద్వారా ప్రజలు తమ ప్రశ్నలను పంపి సమాధానాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. ఈ విధానం ప్రజలకు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేస్తుందని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను మరింత పెంచుతుందని చెప్పారు.
Read Also : EPFO 3.0 : జెట్ స్పీడులో క్లైం డబ్బులు ఖాతాలోకి..