స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన కోనేరు కోనప్ప
హైదరాబాద్: బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప ఆ పార్టీలో ఇమడలేకపోయారు. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉండటం తనను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ లో దండె విఠల్ ఆధిపత్యం
ఓ సారి బీఎస్పీ తరపున కూడా గెలిచిన ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరి మరోసారి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ సిర్పూర్ లో విజయం సాధించింది. బీఎస్పీ తరపున ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలి ఆయన ఓడిపోయారు. ప్రవీణ్ కుమార్ కూడా పరాజయం పాలయ్యారు. తర్వాత ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చేరడంతో అసంతృప్తికి గురైన కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ లో చేరినప్పటికీ.. తాను చెప్పిన పనులను మంజూరు చేయకపోవడంతో పాటు గతంలో నియోజకవర్గానికి తాను తీసుకువచ్చిన పనులు సైతం రద్దు చేస్తుండటంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం ఇక్కడ రాజకీయంగా పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
స్వతంత్రంగా ఉండాలని నిర్ణయం
నిన్న మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న కోనేరు కోనప్ప, ఆయన అల్లుడు శ్రీనివాస్ కలిసిపోయారు. కోనప్ప రాజకీయంగా ముందుకు సాగాలని చూసినా దండే విఠల్ కు పదవి ఉండటం, కోనప్పకి అలాంటిదేమీ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. ఇటీవల ఓ సభలో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.