తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ స్థిరతపై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనను అత్యంత బాధ్యతారహితంగా వక్రీకరించారని విమర్శించారు. ‘‘పిల్లర్లు కుంగిన తర్వాత 5,657 టీఎంసీల నీరు కింద ప్రవహించినా, మేడిగడ్డ బ్యారేజీ చెక్కుచెదరలేదు’’ అని కవిత తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. బ్యారేజీ మొత్తం కూలిపోయిందన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆమె హితవు పలికారు.
తెలంగాణ జీవగడ్డగా మేడిగడ్డ ప్రాధాన్యం
కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే ప్రాజెక్టు అని అన్నారు. ‘‘మరమ్మతులు పూర్తయిన వెంటనే మేడిగడ్డ మళ్లీ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఇది తెలంగాణకు ఇచ్చిన భారీ వరం’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వల్లే తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఇది కేవలం ఇంజనీరింగ్ సమస్య మాత్రమేనని, దీనిని దురుద్దేశంతో రాజకీయం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోండి – కవిత డిమాండ్
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. మోటార్ల మరమ్మతులు పూర్తి చేసి, రైతులకు నీటి సరఫరా మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని, మోటార్లను రిపేర్ చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. మేడిగడ్డపై అనవసర భయాలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోకూడదని ఆమె పిలుపునిచ్చారు.
Read ALso : Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా