తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి బహిరంగం అయ్యాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) మరియు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల తూటాలు ఎగిసిపడ్డాయి. బండి సంజయ్– స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వబోమన్న వ్యాఖ్యలపై ఈటెల తీవ్రంగా స్పందించారు. శామీర్‌పేటలో తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ఈటెల, బండి సంజయ్ వ్యాఖ్యలపై చర్చించి, అనంతరం మీడియాతో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“స్ట్రెయిట్ ఫైట్ చేస్తా, స్ట్రీట్ ఫైట్ చేయను” – ఈటెల హెచ్చరిక
ఈటెల రాజేందర్ (Etela) మాట్లాడుతూ, “నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను కాని కుట్రగాళ్లతో కాదు” అన్నారు. బండి సంజయ్‌ను ఉద్దేశించి “కొడుకా బీ కేర్‌ఫుల్” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. “వాడు ఎవడో.. సైకోనా? శాడిస్టా? వాడు ఎవరి అండతో ధైర్యం చూపిస్తున్నాడు?” అంటూ ఈటెల ప్రశ్నలు సంధించారు. “కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదు” అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలకు జవాబు ఇస్తానని స్పష్టం చేశారు.
“కరీంనగర్ జిల్లా మొత్తం నాతోనే ఉంది” – ఈటెల
ఈటెల తన రాజకీయ సేవలపై గర్వం వ్యక్తం చేస్తూ “2002లో నువ్వు పార్టీలోకి వచ్చినప్పటి నుంచే నేను రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా, రెండు సార్లు మంత్రిగా పని చేశాను” అన్నారు. కరీంనగర్ జిల్లాలో తన అడుగుపడని గ్రామాలు లేవని, తన సేవలకు ప్రజల మద్దతే నిదర్శనమన్నారు. “హుజురాబాద్‌లో నేను ఓట్లిస్తేనే నువ్వు గెలిచావు, ఇది నీ అంతరాత్మకు తెలుసు” అని బండి సంజయ్‌ను ఉద్దేశించి తేల్చి చెప్పారు. కేసీఆర్, వైఎస్ఆర్, కిరణ్ రెడ్డి లాంటి వారితో పోరాడిన తనను బండి సంజయ్‌తో పోల్చవద్దని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మాటల యుద్ధం తెలంగాణ బీజేపీలో విభేదాలు ఎంత లోతుగా వెళ్లాయో మరోసారి స్పష్టంగా చూపించింది.
Read Also ; Telangana Health Department : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు