తెలంగాణలోని భారీ నీటిపారుదల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసుపై Enforcement Directorate (ఈడీ) దృష్టి సారించింది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన నూనె శ్రీధర్, మురళీధర్ రావు, హరిరామ్ నాయక్‌ల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టనుంది. ప్రాజెక్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ నిధులను తమ స్వంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సొమ్ము మళ్లింపు, డెస్టినేషన్ మ్యారేజీలు – నగదు లావాదేవీలపై దర్యాప్తు
ఈ కేసులో ప్రధానంగా అవినీతితో కూడిన సొమ్మును తమ స్వంత కంపెనీలకు మళ్లించి, దాని ద్వారా విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజీలు వంటి ఖరీదైన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపనున్నారు. ప్రాజెక్టులో చేసిన ఖర్చులు, చెల్లించిన బిల్లులు, వాటికి సంబంధించిన నగదు ప్రవాహాలపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
ఏసీబీకి లేఖ – కేసుల వివరాలు కోరిన ఈడీ
ఇంజినీర్లపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దస్తావేజులను సంపాదించేందుకు ఈడీ ముందడుగులు వేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ (ACB)ని సంప్రదించి పూర్తి కేసు వివరాలు, సాక్ష్యాలు, ఆస్తుల లిస్టు కోరనుంది. ఈ విచారణ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజాధనం దుర్వినియోగం అయినదా అనే విషయంపై ఈడీ దర్యాప్తుతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also : TGBKS ఇన్ఛార్జ్ గా కొప్పుల ఈశ్వర్