తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎంఓ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శి (CS)తో సమీక్ష నిర్వహించిన ఆయన, కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి స్కీం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యం. అలాంటి సమయంలో ఎవరికివారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, పథకాల అమలులో ఆటంకం కలిగించడం అసలు సహించేది కాదు” అని ఆయన కఠినంగా హెచ్చరించారు. పథకాలలో జాప్యం జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై చెడ్డ పేరుకి దారి తీస్తుందని, అలాంటి పరిస్థితులను ముందుగానే నివారించాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు.
Telugu News: Indiramma illu: బాధితులకు బాసటగా ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్
రేవంత్ రెడ్డి అన్ని విభాగాలపై సమయానుకూల సమీక్షలు జరపాలని ఆదేశించారు. “ప్రతి శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకురావాలి. పనుల పురోగతి, ఫైళ్ల స్థితిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఫైళ్లు ఆగిపోవడం లేదా పథకాలు నిలిచిపోవడం జరిగితే కఠిన చర్యలు తప్పవు” అని ఆయన హెచ్చరించారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడం కష్టమని సీఎం అన్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వేగవంతమైన పురోగతి అవసరమని ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా, తాను ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నానని, అందుకే ప్రతి రూపాయి సక్రమంగా వినియోగం కావాలని అన్నారు. “ప్రజల అంచనాలకు తగిన విధంగా పని చేయడం మనందరి బాధ్యత. ప్రజా ధనం, ప్రజా సమయాన్ని వృథా చేయడానికి ఎవరికీ హక్కు లేదు” అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణ పెంచి, లబ్ధిదారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తేనే తెలంగాణలో మంచి పాలన కొనసాగుతుందని, తాను స్వయంగా అన్ని విభాగాలపై క్రమానుగతంగా పర్యవేక్షణ కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/