హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు (Adulterated Toddy) కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 43 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులలో చాలామందికి కిడ్నీ సమస్యలు తలెత్తగా, కొందరికి డయాలసిస్ అవసరమవుతోంది. నిమ్స్, గాంధీ సహా ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కల్లు కంపౌండ్‌లలో ఆల్ఫ్రాజోలం వంటి మత్తుమందులు కలిపినట్టు ఆరోపణలున్నాయి.
అధికారుల చర్యలు – దాడులు, అరెస్టులు
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అబ్కారీ శాఖ, పోలీసులు కలిసి కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. బాలానగర్, కూకట్‌పల్లి పరిధిలో మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు. నాలుగు దుకాణాల నుంచి 674 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 66 గ్రాముల తెలుపు పౌడర్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపారు. కొన్ని దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం మిశ్రమం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పలు దుకాణాల లైసెన్సులు రద్దు చేశారు.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా ఆరోగ్యశాఖ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోంది. రెండు రోజులు గడిచినా అధికారులు మొద్దుబారినట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఎక్సైజ్ శాఖ కూడా ఘటన తర్వాత మాత్రమే స్పందించిందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని, బాధితులకు మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also : Mee Seva Services: మీ సేవలో మరో రెండు సేవలు ప్రారంభం