తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal)ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని పరిశ్రమల అభివృద్ధికి మేలు చేస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు.
వరంగల్ విమానాశ్రయం, ఎయిరో-డిఫెన్స్ కారిడార్ పై చర్చ
రాష్ట్ర ప్రాధాన్య అంశాలపై మంత్రి గోయల్‌కు వినతిపత్రం అందజేసిన సీఎం, వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా, హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతిపాదిత ఎయిరో-డిఫెన్స్ కారిడార్‌కు అనుమతి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని సూచించారు. ఈ కారిడార్ అమలైతే, దక్షిణ భారతదేశానికి రక్షణ పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు.
పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు
ఈ భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం పొందేందుకు సీఎం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : CBSE: సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల