తెలంగాణను అతలాకుతలం చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని, జడ్జీలు, రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరించారని ఆరోపించారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని, కేవలం ఢిల్లీకి ముడుపులు పంపడం కోసమే ఈ విచారణను సాగదీస్తున్నారని ఆయన విమర్శించారు.
సిట్ (SIT) విచారణ తీరుపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఒక అంతులేని టీవీ సీరియల్‌లా మారిందని, అధికారులు ఎంత సమర్థులైనప్పటికీ ప్రభుత్వం వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. కేటీఆర్ లాంటి కీలక వ్యక్తులను నిందితులుగా కాకుండా, బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి బ్రిటీష్ కాలం నాటి నిరంకుశ పాలన సాగించారని, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, సినీ నటులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపించినా అరెస్టులు ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు.
Sammakka Saralamma: మేడారం భక్తులకు షాక్.. భారీగా పెరిగిన బెల్లం ధరలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న సంకేతాలను బండి సంజయ్ తన ప్రసంగంలో బలంగా వినిపించారు. విచారణ పేరుతో హడావుడి జరిగినప్పుడల్లా కేసీఆర్ ఫాంహౌజ్ నుండి ఏఐసీసీకి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవిత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, సామాన్య ప్రజలు కూడా నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని దుయ్యబట్టారు. ఈ “టైమ్ పాస్” విచారణను ఆపి, సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: http://hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com