Kishan Reddy : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడారు. నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు.
కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు
కేసీఆర్‌కు తమ పార్టీ కార్పొరేటర్లపై నమ్మకం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు వెళ్లొద్దని వారికి చెబుతున్నారన్నారు. మజ్లిస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపించారు. ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలనే బీజేపీ పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు
అంతేకాకుండా, ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారు? అని ప్రశ్నించారు. మజ్లిస్ గెలుపు కోసమే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ