తెలంగాణలో తీన్మార్ మల్లన్నపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న వరంగల్‌లో జరిగిన బీసీ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రెడ్డి సంఘాల నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో, తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించారని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు?’ అంటూ రెడ్డి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని, ఒక ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. బీసీల కోసం పోరాడటం తప్పేమీ కాదు, కానీ ఇతర సామాజిక వర్గాలను అవమానించడం సమంజసం కాదని వారు అన్నారు.
ఈ ఫిర్యాదుతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు మల్లన్న వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మల్లన్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
దీంతో, మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు మల్లన్న తన మాటలను సమర్థించుకుంటుండగా, మరోవైపు రెడ్డి సామాజిక వర్గం ఈ వివాదంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమాజంలో గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.