చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వయంగా రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, ప్రభుత్వ సహాయం పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. త్వరలోనే స్వయంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తానని సీఎం ప్రకటించారు.
ఈ దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తీవ్రంగా స్పందించారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు చేయడాన్ని ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర అర్చకుడిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాముడి పేరు తీసుకుని దాడులకు పాల్పడడం దుర్మార్గమని, ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.
పోలీసులు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వీర రాఘవ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదనంగా మరో ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మొత్తం 20 మందిని గుర్తించి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు.
రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు దీన్ని ఖండించారు. కేటీఆర్ స్వయంగా రంగరాజన్‌ను కలసి పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, తమ అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు.