కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కులగణన అంశాన్ని స్వాగతిస్తున్నామని, దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలంటే అన్ని రాష్ట్రాల సూచనలను తీసుకుని, ఒక స్పష్టమైన విధానాన్ని కేంద్రం రూపొందించాలని సూచించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్రం అమలు చేస్తే ఆనందించాల్సిందే. కులగణనను మోడల్గా తీసుకొని, కేంద్రం, రాష్ట్రాలు కలిసిపని చేస్తే ఏడాదిలో పూర్తి చేయవచ్చు” అని వ్యాఖ్యానించారు.రాష్ట్రాల్లో ఉన్న వర్గభేదాలను గుర్తు చేస్తూ, కులగణన రాష్ట్రాలకు అనుగుణంగా జరగాలని సూచించారు. కేంద్రం కులగణన కోసం మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మోడల్ ను దేశం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 57 ప్రశ్నలతో కూడిన 8 పేజీల కులగణన ఫారాన్ని రూపొందించి ప్రజల నుండి గోప్యంగా సమాచారం సేకరించిన విషయాన్ని వివరించారు.ఇంతవరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, విపక్షాల ఒత్తిడితో ఇప్పుడు ముందుకు వచ్చిందని ఆరోపించారు. “జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేశాం. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారు” అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కులగణనకు మద్దతుగా రెండు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
CM రేవంత్ రెడ్డి – కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ సీఎం
రాహుల్ గాంధీ సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి రోల్ మోడల్ గా నిలిచినట్లు తెలిపారు. అన్ని పార్టీలతో కలిసి కులగణన ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించామని పేర్కొన్నారు. కులగణన తర్వాత సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. కులగణన ప్రక్రియకు తుది తారీఖులను నిర్ణయించాలని కేంద్రాన్ని కోరారు. “కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. దేశంలోని బలహీన వర్గాల అభివృద్ధికి ఇది కీలకం అవుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఈ ప్రక్రియను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ శాంతియుతంగా కొనసాగించాలని ఆయన సూచించారు. కులగణన విషయంలో తెలంగాణ అనుభవాన్ని కేంద్రంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Read More : Terrorism : ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరిక