తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం తర్వాత జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలైన వృద్ధాప్య పింఛన్ రూ. 4000కు పెంపు, మరియు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం అమలుపై అధిష్టానం ఆరా తీసింది. ఈ పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, కాబట్టి వీటిని త్వరితగతిన పట్టాలెక్కించాలని హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పథకాల అమలులో ఎదురయ్యే సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రెండు పథకాలను అమలు చేయడానికి ఏటా సుమారు రూ. 22 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ నిధుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నామని, ఆర్థిక వనరులను సమకూర్చుకున్న తర్వాత దశలవారీగా లేదా ఏకకాలంలో వీటిని ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com