తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది(Krishna River)పై రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస అవగాహన కూడా లేదంటూ మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 763 టీఎంసీల వాటా రావాలని మాజీ సీఎం కేసీఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు పోరాటం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ “500 టీఎంసీలతో సరిపోతుంది” అన్న తీరుతో రాష్ట్ర హక్కులకు తూట్లు పొడుస్తున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు
ఈ తరహా నిర్ణయాల వల్ల ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదన నీరుగారిపోతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఒకవేళ అధికారికంగా 500 టీఎంసీలే అవసరమని చెబితే, భవిష్యత్తులో మిగిలిన 263 టీఎంసీలపై తెలంగాణ హక్కు కోల్పోతుందని ఆయన వివరించారు. ఇది రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదముందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు, భవిష్యత్ తరాలకు అన్యాయం అని హరీష్ విమర్శించారు.
ఏపీకి రాష్ట్ర హక్కులను రాసిచ్చేది ఊహించలేం
తెలంగాణ తరఫున అధికారికంగా తీసుకునే అభిప్రాయాలు చాలా గంభీర పరిణామాలకు దారితీయవచ్చని హరీష్ రావు హెచ్చరించారు. “ఏపీ ముఖ్యమంత్రికి రాష్ట్ర హక్కులు రాసిచ్చే స్థాయిలో సీఎం వ్యవహరించటం క్షమించదగిన విషయం కాదు. తెలంగాణ హక్కులను ఎవరికీ అర్పించం. గళమెత్తుతాం, పోరాటం చేస్తాం” అని హరీష్ హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో సరైన అవగాహనతో, నిబద్ధతతో వ్యవహరించాలనీ, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read Also : Law Set Results : లా సెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ ఎమ్మెల్యే