బ్యాంకు మేనేజర్, క్యాషియర్ సహా 44 మంది నిందితుల అరెస్టు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు(Chennur SBI) ఎస్బీఐ-2 బ్యాంకులో వెలుగులోకి వచ్చిన భారీ చోరీ కేసులో సంచలనం నెలకొంది. ఈ కేసు నేపథ్యంలో బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో పాటు 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 15.237 కిలోల బంగారం, ₹1.61 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.
క్యాషియర్ బెట్టింగ్స్ మోజు
చెన్నూరు ఎస్బీఐ-2లో(SBI) క్యాషియర్గా పనిచేసిన రవీందర్ కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్స్‌కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో బ్యాంకులో ఖాతాదారులు జమ చేసిన బంగారు నగలను స్థానిక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని కూడా పందాలకే వినియోగించి భారీగా నష్టపోయాడు. అదేవిధంగా బ్యాంకులోని(Chennur SBI) కోటి రూపాయలకు పైగా నగదును కూడా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పరిచయస్తుల నుంచి వడ్డీకి నగదు, బంగారం తీసుకుని లాకర్లలో ఉంచేవాడు.
కొన్ని రోజుల క్రితం రవీందర్ సెలవుపై వెళ్లి పారిపోవడం, మేనేజర్ మనోహర్‌రెడ్డి(Manager Manohar Reddy)కూడా కనిపించకపోవడంతో, ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఆడిట్‌లో ఈ గోల్‌మాల్ బట్టబయలైంది. విచారణలో 2024 అక్టోబర్ నుండి రవీందర్ వరుసగా ఆన్లైన్ బెట్టింగ్స్‌లో నష్టపోయి, మొత్తంగా 40 లక్షలకు పైగా పోగొట్టుకున్నట్టు తేలింది. ఈ క్రమంలో అతను 402 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన 25.17 కిలోల బంగారం, ₹1.10 లక్షల నగదును దుర్వినియోగం చేశాడు. ఇందులో మేనేజర్ మనోహర్‌రెడ్డి, మరో ఉద్యోగి కూడా సహకరించారు.
ఆడిటింగ్‌లో బయటపడిన గోల్‌మాల్
అంతర్గత ఆడిటింగ్‌లో నిజాలు బహిర్గతం కావడంతో, చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం పరారీలో ఉన్న రవీందర్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేసి విచారించగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత మేనేజర్ మనోహర్‌రెడ్డి, కొంగండి బీరేష్, నరిగే సరిత, నరిగే స్వర్ణలత అలియాస్ గోపు, ఉమ్మల సురేష్, కొదటి రాజశేఖర్, గౌడ సుమన్, ఎనంపల్లి సాయికిరణ్, సందీప్, మోత్కూరి రమ్యలతో పాటు మరో 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 15.237 కిలోల బంగారం, ₹1.61 లక్షల నగదు జప్తు చేశారు.
ఇంకా దాదాపు 20 శాతం నగలు స్వాధీనం కావాల్సి ఉందని కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. ఈ కేసులో పకడ్బందీగా వ్యవహరించిన చెన్నూరు పోలీసులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూరు సీఐ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: Hindi.vaartha.com
Read also: