తెలంగాణలో వరుసగా బస్సు ప్రమాదాలు( Bus Accidents) – నల్గొండ, కరీంనగర్, సత్యసాయి జిల్లాల్లో
చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరవకముందే మంగళవారం తెల్లవారుజామున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నల్గొండ, కరీంనగర్, సత్యసాయి జిల్లాల్లో జరిగిన ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఒక మహిళ దుర్మరణం చెందింది.
Read Also: Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె
నల్గొండ ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి హైవేపై ప్రమాదం జరిగింది. కావలి నుంచి హైదరాబాద్‌కి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సత్యసాయి జిల్లా ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి జాతీయ రహదారి–44పై మరో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సురక్ష (32) అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త వినీత్ మరియు కుమార్తె నిధి (3) గాయపడ్డారు. మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు గాయపడి చెన్నేకొత్తపల్లి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ ప్రమాదం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు, ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎల్‌ఎండీ పోలీసులు, స్థానికులతో కలిసి గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలు గంటలపాటు నిలిచిపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: