BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Read Time:  1 min
BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

BRS vs Congress Municipal Elections: మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సోమవారం మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డికి త్వరలోనే జైలు శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు.

Read Also: TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కుట్ర!

హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికం కాదని, అది రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో జరిగిన భారీ కుట్ర అని హరీష్ రావు ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందనే భయంతో, కీలక సాక్ష్యాలను మాయం చేసేందుకే పోలీసుల సహకారంతో ఈ దహనకాండకు పాల్పడ్డారని విమర్శించారు. జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడానికి రాష్ట్రవ్యాప్త కుతంత్రాలకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.

BRS vs Congress Municipal Elections
BRS vs Congress Municipal Elections: Harish Rao makes sensational remarks against Revanth Reddy.

BRS vs Congress Municipal Elections: హామీలు గాలికి.. మోసాల్లో రేవంత్ నెంబర్ వన్

ఏడుపాయల అమ్మవారి సాక్షిగా ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మొక్కుకుని ఇప్పుడు రైతులను వంచించారని, రైతుబంధు ఎగ్గొట్టి రాష్ట్రంలో ఎరువుల కరువు తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడవ రంజాన్ వచ్చినా ముస్లింలకు పండుగ తోఫా కూడా ఇవ్వలేదని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయాయని, తులం బంగారం హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మైనార్టీ గురుకులాలు, షాదీఖానాలతో సెక్యులర్ పాలన అందిస్తే, రేవంత్ మాత్రం బూతు పురాణంతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

మెదక్ గడ్డపై రౌడీయిజం చెల్లదు

మల్కాజీగిరి నుంచి రౌడీలను, గుండాలను తీసుకొచ్చి మెదక్ అభ్యర్థులను భయపెట్టాలని చూస్తున్నారని హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారు. “మెదక్ గడ్డ రౌడీయిజానికి బెదిరే గడ్డ కాదు” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లను గెలిపించకపోతే బిల్లులు రావని బెదిరిస్తున్న ఎమ్మెల్యేలపై మండిపడుతూ.. బిల్లులు ఏమైనా మీ జేబుల నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పేదలకు ఒక్కొక్కరికి 60 వేల రూపాయల బాకీ పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

కారు గుర్తుకే మా ఓటు

మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, రోడ్లు, భవనాలు వంటి మౌలిక వసతులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.