తెలంగాణలో బహిరంగ సభలకు అనుమతులపై వివాదం చెలరేగింది. ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పిటిషన్‌లో పేర్కొంది.
అనుమతులివ్వాలని కోరిన బీఆర్‌ఎస్
పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే సభ కావడంతో ముందస్తు అనుమతులు కోరినప్పటికీ పోలీసుల నుంచి సహకారం లేకపోవడం వల్ల తమకు కోర్టు జోక్యం అవసరమైందని బీఆర్‌ఎస్ వాదించింది. సభకు సంబంధించి శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఏమీ ఉండదని, అనుమతులివ్వాలని హైకోర్టులో స్పష్టం చేసింది.
హైకోర్టు విచారణ 17కి వాయిదా
ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది. అప్పటివరకు పోలీసుల అనుమతిపై తుది తీర్పు ఉండదు. బీఆర్‌ఎస్ నేతలు సభకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్కతుర్తి సభతో పార్టీ పునర్వికాసానికి నాంది పలకాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్, కోర్టు తీర్పును ఆశగా ఎదురుచూస్తోంది.