తెలంగాణ ప్రత్యేక సాంప్రదాయంగా నిలిచిన బతుకమ్మ పండుగ నేటి నుంచి ఘనంగా ప్రారంభమవుతోంది. అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో మహిళలు తమ ఇళ్లలో బతుకమ్మను తయారు చేసి వీధుల్లో ఉంచి నృత్యగీతాలతో ఆడిపాడుతారు. పువ్వులతో అద్భుతంగా అలంకరించిన బతుకమ్మను ప్రతీ రోజు తీరోక్కగా తయారు చేస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ద్వారా భక్తి, సాంప్రదాయాలను సమన్వయం చేస్తారు. ఈ వేడుకలు సామాజిక సౌహార్దానికి, స్త్రీల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
వేములవాడ ప్రత్యేకత – ఏడు రోజుల బతుకమ్మ
తెలంగాణలో అన్ని చోట్ల తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరగగా, వేములవాడలో మాత్రం ప్రత్యేకంగా కేవలం ఏడు రోజులపాటు మాత్రమే ఈ సంబరాలు నిర్వహిస్తారు. ఏడో రోజు “వేపకాయల బతుకమ్మ”ను “సద్దుల బతుకమ్మ”గా ఘనంగా జరుపుకోవడం అక్కడి ప్రత్యేకత. ఈ సందర్భంగా మహిళలు తమ పుట్టింటి తో పాటు మెట్టినింటిలో కూడా బతుకమ్మను ఆడుతారు. ఈ ఆనవాయితీ వేములవాడలోనే తరతరాలుగా కొనసాగుతూ వస్తూ స్థానికుల కోసం ప్రత్యేక గౌరవప్రద సంప్రదాయంగా మారింది.
దసరా ఉత్సవాలతో కలిపి జరుపుకునే సంబరాలు
వేములవాడలో బతుకమ్మ పండుగ(Bathukamma)తో పాటు దసరా సంబరాలు కూడా సమాన ఉత్సాహంతో జరుగుతాయి. స్థానికులు దసరా వేడుకలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పూజలు, పండగ వాతావరణంలో జరుపుకుంటారు. అయితే, బతుకమ్మ ప్రత్యేకత వల్ల వేములవాడ దసరా సంబరాలు మరింత వైభవంగా మారుతాయి. ఇక్కడి మహిళలు, యువతులు పాల్గొనే బతుకమ్మ ఆటలు, పాటలు సాంప్రదాయ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.