సిఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్ : తెలంగాణలోని లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఎం రేవంత్ రెడ్డి ని (Revanth Reddy) కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కోరారు. ఈమేరకు బహిరంగ లేఖ రాసారు. రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డిఎలను పెండింగ్లో ఉంచిందని, ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటి, ఈపిఎఫ్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదన్నారు. 2023 జులై నుండి అమలు చేయాల్సిన పిఆర్సిని రెండున్నరేళ్లు అవుతున్నా ఊసే ఎత్తకపోవడం శోచనీయమని, కనీసం పిఆర్సి రిపోర్ట్ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును సైతం ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
Read Also: HYD: మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి
రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు కారణమని విమర్శ
2024 నుండి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. ఆనాటి నుండి నేటి వరకు వారికి రావాల్సిన బెన్ ఫిట్స్, 5 డిఏలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం కోసం, ఉన్నత చదవులు చదివించడం కోసం దాచుకున్న సొమ్మును చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదని, ముక్కు మొఖం తెలియని వ్రుద్దులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హ్రుదయమున్న తెలంగాణ సమాజం మనది.
అట్లాంటిది జీవితాంతం ప్రభుత్వానికి ఊడిగిం చేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వారిని బెన్ ఫిట్స్ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఉసురు పోసుకోవడం అత్యంత శోచనీయం (Bandi Sanjay) అన్నారు. మీ నిరక్ష్యంవల్ల బెన్ ఫిట్స్ అందక గత ఏడాది నుండి ఇప్పటి వరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు లోనై మరణించారన్నారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? వారిపై ఆధారపడిన కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారు? ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపట్ల పాలకులు ఇంతటి కర్కశంగా వ్యవహరించడం తెలంగాణకు మాయని మచ్చ తెస్తుందనే విషయం మరిచిపోయారా? రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తుందన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన దీక్ష చేయడానికి సూచనలు
యేటా రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించడం భారంగా భావించడం అంటే అంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకోటి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నట్లు కన్పిస్తుందని, ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పురోభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందన్నారు. ఇకనైనా వారిపట్ల మీకున్న నిర్లక్ష్య ధోరణిని విడనాడి బకాయిలన్నీ చెల్లించాలని కోరుతున్నామన్నారు.
ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ బకాయిలను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లేనిపక్షంలో మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకూ వెనుకాడబోమన్నారు. అవసరమైతే హైదరాబాద్ నడిబొడ్డున ఆయా ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకునేందుకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని సిఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: