హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రత, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా హెచ్‌ఎండీఏ కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉప్పల్‌లో 660 మీటర్ల పొడవుతో, రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్కైవాక్ పాదచారులు రోడ్డు దాటడానికి సురక్షిత వేదికగా నిలిచిన కాకుండా, సాయంత్రం వేళల్లో సందర్శకులను ఆకర్షించే కేంద్రంగా కూడా మారింది. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, హెచ్‌ఎండీఏ ఇప్పుడు మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా కొత్త స్కైవాక్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతోంది.
మెహిదీపట్నం ప్రాంతం నగరంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఒకటి. ఇక్కడ రోజూ లక్షలాది వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో రూ.34.86 కోట్ల వ్యయంతో 380 మీటర్ల పొడవైన స్కైవాక్ నిర్మాణం చేపట్టబడింది. డిఫెన్స్ భూముల సమస్యల కారణంగా ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం దాని నిర్మాణం పూర్తి దశలో ఉంది. ఈ స్కైవాక్ (Skywalk ) ప్రారంభమైతే పాదచారులు రహదారిని సురక్షితంగా దాటడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ కూడా కొంతవరకు తగ్గుతుంది. పాదచారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రాజెక్ట్ స్థానిక ప్రజలకు విశేష ఉపశమనం కలిగించనుంది.
కూకట్‌పల్లి జేఎన్‌టీయూ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా స్కైవాక్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కూకట్‌పల్లిలో జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ నుంచి లులు మాల్ వరకు సుమారు 600 మీటర్ల పొడవుతో స్కైవాక్ నిర్మించనున్నారు. దీనిని పీపీపీ పద్ధతిలో తీసుకెళ్లాలా లేక నేరుగా హెచ్‌ఎండీఏ నిర్మించాలా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా భారీ స్కైవాక్ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే నగరంలో పాదచారుల భద్రత గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, స్కైవాక్‌లు నగర జీవన శైలిలో భాగస్వామ్యం అవుతాయి. ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్న పాదచారులకు ఇవి భవిష్యత్తులో మరింత ఉపశమనం ఇవ్వనున్నాయి.