హైదరాబాద్(Hyderabad)ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) బలోపేత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నగర వాసులను తరచూ ఇబ్బంది పెట్టే ట్రాఫిక్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించింది. ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మించి ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవల కొండాపూర్ ఫ్లైఓవర్ పూర్తి కావస్తుండగా, తాజాగా గచ్చిబౌలిలో మరో భారీ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) సిద్ధమవుతోంది.
గచ్చిబౌలిలో భారీ ఫ్లైఓవర్ – ప్రయాణికులకు ఊరట
హెచ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ వరకు మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడమే కాక, హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ నుంచి నానక్ రాంగూడ, లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలకు ఈ ఫ్లైఓవర్ ఉపశమనంగా మారనుంది. దీనితో పాటు ఒక అండర్ పాస్‌ను కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేనట్లు అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విస్తృత అభివృద్ధి
‘హెచ్ సిటీ’ (Hyderabad City Innovative Transformative Infrastructure) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7,032 కోట్లతో 58 మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్‌లు, 4 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 3 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. ఇవి నగరంలో ట్రాఫిక్‌ను దూరం చేయడమే కాకుండా ప్రయాణాన్ని వేగవంతం చేయనున్నాయి. ఇప్పటికే చాలా పనులు టెండర్ దశలో ఉండగా, కొన్ని పనులకు ఒప్పందాలు పూర్తయ్యాయి. త్వరలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
Read Also : Israel : చివరి విమానాన్ని ధ్వంసం చేశాం : ఇజ్రాయెల్