భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చిన వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. “ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టాం” అనే ఈ-మెయిల్ మెసేజ్ వచ్చిన వెంటనే అధికారులు హైఅలర్ట్ ప్రకటించి, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఫేక్ బెదిరింపా? సైబర్ ట్రేసింగ్
అయితే గతంలోనూ దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇది ఫేక్ బెదిరింపు ఈ- మెయిలా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ-మెయిల్‌ను ట్రేస్ చేసేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించి, అది ఏ దేశం నుంచి పంపబడిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో ఇదే తరహాలో కొన్ని నగరాల్లో పంపిన బెదిరింపు మెయిల్స్ కూడా అనంతరం ఫేక్‌గా తేలిన ఉదాహరణలు ఉన్నాయి.
భారత్-పాక్ యుద్ధ ముప్పుతో పెరిగిన భద్రతా ప్రమాణాలు
ప్రస్తుతం సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దేశంలోని కీలక మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకి మరింత భద్రత అవసరమవుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) లో ఇప్పటికే RAF (Rapid Action Force), CISF, తెలంగాణ పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు.
ప్రజలలో ఆందోళన, ప్రభుత్వ విజ్ఞప్తి:
మరోవైపు సరిహద్దులో యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో బలగాలను పూర్తిస్థాయిలో మోహరించారు. 24 గంటల పాటు పూర్తి పర్యవేక్షణతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్ బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read also: Maoists: లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు