తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరింత వేడెక్కిన విషయం – ఫార్ములా ఈ-రేసు కేసు! ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన “లొట్టపీసు కేసు” వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
“తప్పు చేయలేదంటే విచారణకు ఎందుకు భయం?”
ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రకారం, తప్పు చేయనప్పుడు అరెస్టుకు ఎందుకు భయపడుతున్నారని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన గట్టి తీర్పుతో కల్వకుంట్ల కుటుంబం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా వరుస కేసులతో ప్రజా సేవను పట్టించుకోవడం లేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
“రాచమర్యాదలు తప్పు చేసినవారికేనా?”
ఏసీబీ విచారణకు హాజరై బయటకు వచ్చారు కేటీఆర్ గారు. వెంటనే బాణాసంచాలు కాల్చడం, పూలమాలలు వేసి స్వాగతం పలకడం చూడగానే చలించిపోయాం. ఇది ప్రజాస్వామ్యానికి కళంకం. తప్పు చేసిన వారికి రాచమర్యాదలు ఎందుకు? ఇది చట్టాలమీద గౌరవం లేకపోవడం మాత్రమే కాదు, ప్రజలను మూర్ఖులుగా భావించే ధోరణి. ప్రజలు ఇప్పుడు విజ్ఞత కలిగినవారు. మీ కుట్రల్ని తేలికగా పసిగట్టగలుగుతున్నారు.” “అరెస్ట్ చేయనందుకే ఈ సంబరాలు చేసుకుంటున్నారా?” అని నిలదీశారు. తప్పు చేసిన వారికి రాచమర్యాదలు దక్కుతున్నాయని, బావ, బావమరుదులు ఆలింగనాలు చేసుకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“మేకపోతు గాంభీర్యం, లోపల వణుకు”
ఫార్ములా ఈ-రేసు కేసును తేలిక చేసి మాట్లాడిన కేటీఆర్, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం భయంతో వణికిపోతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇది రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థను నమ్మని మనస్తత్వానికి నిదర్శనం.