తెలంగాణలో మత్తు కలిగించే మందుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (Prescription ) లేకుండా మత్తు మందులు విక్రయించే మెడికల్ షాపులు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ అథారిటీ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. యువతను ఈ మత్తు మందుల బారి నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం
మందుల విక్రయాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే కంపెనీలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంత్రి (Minister Damodar Raja Narasimha) ఆదేశించారు. అనుమతి లేని ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగించే వారిపై నిఘా పెంచాలని సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి తెలిపారు.
నిబంధనల ఉల్లంఘనకు శాశ్వత మూసివేత
పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మత్తు మందుల విక్రయాలు, అనుమతి లేని మందుల అమ్మకాలలో పట్టుబడిన సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు, వాటిని శాశ్వతంగా మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని, అక్రమాలకు పాల్పడే వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, తనిఖీలు పెంచాలని సూచించారు. ఈ కఠిన చర్యల ద్వారా రాష్ట్రంలో మందుల విక్రయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.