తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసిన విధంగా పథకాలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి చెప్పుకొచ్చారు. తాము ఏడాది కాలంలోనే తెలంగాణలో ప్రజా పాలన కోసం ఎన్నో మార్పులు తెచ్చామని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎప్పుడూ జరగని విధంగా తమ హయాంలో 21 వేల కోట్ల మేర రుణమాఫీ అమలు చేసామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నామంటూ పథకాల వారీగా వివరించారు.
తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఇటు కేటీఆర్ ఈడీ ఎదుట విచారణ హాజరు వేళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి కేటీఆర్ ప్రస్తావించారు. అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో యువతకు ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు అవుతాయని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని రేవంత్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. తెలంగాణ విషయంలో హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని ఉద్ఘాటించారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు.