భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కోసం మౌలిక క్షణాలు ప్రారంభమయ్యాయి. నాసా అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపు రేపే ప్రయాణించనున్నారు. యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్‌లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు.నాసా తాజా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జరగనుంది. ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో డాకింగ్ కానుంది.
మిషన్‌లో శుభాంశుకు కీలక బాధ్యతలు
ఈ ప్రతిష్ఠాత్మక యాత్రను వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఈ ప్రయోగంలో ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా అంతరిక్షం చేరనున్నారు. ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.
14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనలు
బయలుదేరిన తర్వాత సుమారు 28 గంటల ప్రయాణంతో ఐఎస్ఎస్‌కి చేరుకుంటారు. అనంతరం బృందం 14 రోజులు అక్కడే బస చేయనుంది. ఈ సమయంలో పలు శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. అంతేకాకుండా శుభాంశు శుక్లా అంతరిక్షం నుంచే భారత ప్రధాని మోదీ, విద్యార్థులతో ముచ్చటించనున్నట్టు సమాచారం.
వాయిదాల తర్వాత చివరకు స్థిరమైన తేదీ
ఈ మిషన్ తొలుత మే 29న జరగాల్సి ఉంది. కానీ వాతావరణం, సాంకేతిక సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించింది. శుభాంశు అంతరిక్ష గగనాన్ని తాకేందుకు రెడీ అయ్యారు.
Read Also : Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది – ట్రంప్